వంశీకి సినిమా దర్శకుడిగా బోలెడంత పేరు ప్రఖ్యాతులున్నాయి. మంచి సినిమాలు తీసిన దర్శకుడిగా అఖిలాంధ్ర ప్రేక్షకులకు ఆయన తెలుసు...
గోదావరి అందాలను ఆరబోస్తూ రాసిన పసలపూడి కథలు, దిగువ గోదావరి కథల రచయితగా వంశీ, పత్రికలు చదివే పాఠకులందరికీ తెలుసు.
కోటిపల్లి రైలుమార్గం, గోదావరి ప్రయాణం, హంపీ సౌందర్యం, రైలు ప్రయాణంలో బిచ్చగాళ్ళ ప్రవర్తన వంటి యాత్రా కథలను సైతం వంశీ, కళాత్మకంగానూ ఆర్తితోనూ రాయగలడని అవి చదివిన కొద్దిమంది పాఠకులకయినా తెలుసు. ఆయనకున్న సంగీత పరిజ్ఞానం తక్కువేం కాదని సినీరంగంలో ఉన్నవారికి మాత్రమే తెలుసు...(ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, కొత్త సినిమాలో లాయన పాడిన పాటలతో) ఇంకా చాలామందికి చాలా రకాలుగా వంశీ తెలుసు. కానీ వంశీకున్న సమాజాన్ని వీక్షించే దృష్టికోణం గురించి,మానవ సంబంధాల పట్ల ఆర్తిగా స్పందించే గుణం గురించి అతి కొద్ది మందికే తెలుసు. ఆ కొద్ది మందికి తెలిసిన లక్షణాలు ఈ కథా సంపుటం ద్వారా అందరికీ తెలిసిపోతాయి. ఒక్కమాటలో వంశీని సమగ్రంగా దర్శించడానికి ఈ కథా సంపుటం చాలు.. ముప్ఫై ఒక్క కథలు, ఒక నవలిక - ఇది ఈ ఆకుపచ్చని జ్ఞాపకం.