ఆనాడు సంఘంలో పాతుకొనిపోయిన చెడుగులనుంచి ప్రజలను రక్షించాలని వీరేశలింగం పంతులుగారు నయాన భయాన తెలుగువారికి బోధించారు.
వీరేశలింగం జీవించిన డెబ్బై ఒక్క సంవత్సరాలలో ఏభై సంవత్సరాల కాలం నిర్విరామంగా ఆయన సాహిత్యకృషీ, సమాజోద్ధరణమూ కూడా చేశాడు. నూటికిపైగా గ్రంథాలు రచించాడు. ఎన్నో పాఠశాలలు నెలకొల్పాడు. చిన్నతనంలోనే వితంతువులైన బాలికలకు పునర్వివాహం చేయటానికి పూనుకొని అది సాధ్యమేనని నిరూపించాడు. తెలుగుదేశంలో విద్యాసంస్థలలో బాలబాలికల సహ విద్యావిధానాన్ని ప్రవేశపెట్టాడు. అణగారిన వర్గాల వారిని ఆదుకొని వారికి తన విద్యా సంస్థలలో ఉచిత విద్యా ప్రధానం గావించాడు. ప్రజలు తమ సమస్యలను సాముదాయికంగా చర్చించడానికి, సమావేశాలు జరపడానికి అనువైన పురమందిర నిర్మాణం ఆయనవల్లనే రాజమండ్రిలో తొలిసారి రూపుదిద్దుకొంది.
పురపాలక సంఘంలో సభ్యుడై పౌరహితం కోసం ఆయన శ్రమించారు. స్వీయచరిత్ర, కవులచరిత్ర వంటి గొప్ప గ్రంథాలను ఆయన తెలుగువారికిచ్చారు. సాంఘిక చైతన్యం కలిగిస్తే తక్కిన రంగాలలో ప్రజలు పురోభివృద్ధిని సాధిస్తారని ఆయన విశ్వాసం. తన కృషినంతా ఆ లక్ష్యసాధనకే ఆయన కేంద్రీకరించాడు. వీరేశలింగం మహాశయుని జీవితచరిత్రను సంక్షేపంగా, 8 ప్రకరణాలుగా చెప్పాను. ఈనాటి యువతరం ఈ ప్రయత్నం హర్షించాలని నా కోరిక. - అక్కిరాజు రమాపతిరావు

Write a review

Note: HTML is not translated!
Bad           Good