'...పెద్దల మాట ఎప్పుడూ చద్దిమూటే! ఆ చద్ది అన్నానికి తాలింపు వేసి, పింగాణీ పళ్లెపు హంగులతో అందిస్తే కొత్త తరానికీ హత్తుకుంటుంది. సినిమా మాధ్యమం కలిగించే బలీయమైన ప్రభావం తెలిసి దాన్ని సమాజశ్రేయస్సుకు ఉపయోగించ దలచిన మహనీయులెందరో యీ సత్యాన్ని గుర్తించి సూక్తులను సూక్తులుగా కాక చిత్రగీతాలుగా మలచి శ్రవణీయంగా, కమనీయంగా అందించారు. మళ్ళీ మళ్ళీ నెమరేసుకునే లయబద్దమైన పదాలతో, శ్రవణపుటాలలో నిలిచిపోయే బాణీలతో, కనురెప్పలలో కాపురముండిపోయే చిత్రీకరణతో చేరడంతో అవి మనసును మేల్కొల్పుతాయి, ప్రభోధిస్తాయి, హెచ్చరిస్తాయి, దారి చూపుతాయి, ఓదారుస్తాయి, లోకరీతి వివరిస్తాయి.

ఈ కృషిలో గీతకారులు, సంగీతకారులు, ఛాయాగ్రాహకులు, దర్శకులు ఎందరు పాలుపంచుకున్నా ఈ హితబోధ కథానాయకుని పరంగానే ప్రేక్షకులలో నాటుకుంటుందన్నది విస్మరింపలేని వాస్తవం.
''మనసున మనసై'', ''నీతికి నిలబడి నిజాయితీగా పదరా..'', ''గాంధీ పుట్టిన దేశమా యిది.'', ''కారులో షికారు కెళ్ళే...'', ''ఎదగడాని కెందుకురా తొందరా..'', ''కల కానిది, విలువైనది..'', ''నా జన్మభూమి ఎంతో అందమైన దేశమూ..'', ''బడిలో ఏముంది..'', ''బ్రతుకు పూలబాట కాదు..'', ''విద్యార్దులు నవసమాజ నిర్మాతలురా..'' ఇటువంటి పాటలు నటసామ్రాట్‌ నటించి వుండకపోతే ప్రేక్షకుల హృదయాలను తాకేవా? తాకినా అక్కడ నాటుకునేవా? అందుకనే 'పద్మవిభూషణ్‌' అక్కినేని నాగేశ్వరరావుగారి 88వ జన్మదిన సందర్భంగా వెలువడుతున్న యీ పుస్తకానికి మకుటం ''అక్కినేని చిత్రాల్లో సూక్తులు''.

Write a review

Note: HTML is not translated!
Bad           Good