మనిషిని జంతువు నుంచి విడదీసే ప్రధాన లక్షణం బుద్ధి. ఉచితానుచిత వివేచనను బట్టి, ఉదాత్త లక్ష్య సమాలోచనను బట్టి ఒక వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది. మనిషికీ మృగానికీ ఆవేశంలో పెద్దతేడా ఏమిలేదు. ఉన్న వ్యత్యాసమంతా ఆలోచనలోనే.
డా|| అక్కినేని నాగేశ్వరరావు వస్తుతః ఆలోచనా జీవి. ఆయనకు అప్పుడప్పుడూ ఆవేశం ఉద్గామిస్తుంది. అది ఆలోచనా మూలాలను తెంచుకుపోయే ప్రభంజనం కాదు. ధర్మాగ్రహం మాత్రమే. డా|| అక్కినేనికి జీవితమే విద్యాలయం. ప్రతి అనుభవం ఒక పాఠం. అయితే నేర్చుకున్న పాఠములన్నిటినీ యధాతథంగా స్వీకరించాలని లేదు. నిశిత మతితో వాటిని పొరలు పొరలు గా విశ్లేషించాలి. నలుపు తెలుపులని విడదీసి చూడాలి. మిరుమిట్లు గొలిపే సన్నివేశాలకున్న అసలు పస ఎంతో. అద్దిన రంగు హంగేమిటో పరిశీలించాలి. తమ సుదీర్ఘ జీవన యాత్రలో అవివేచన శీలాన్ని పెంపొందించుకున్నారు నాగేశ్వరరావు. అందుకు పర్యవసానం అక్షరరూపంలో అక్కినేని ఆలోచనల అవతరణం.
- డా|| సి. నారాయణరెడ్డి.