సాయంత్రం సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకట్లు ముసురుతున్నాయి. పిల్లలకి పాలు కూడా పట్టలేని నిస్సహాయత, నైరాశ్యం నన్ను పూర్తిగా ఆవరించాయి. పసిపిల్లలిద్దర్నీ ఆ పొలాల్లో బోర్ బావిలో పడేస్తున్నా, నేనూ దూకేస్తున్నా...
మూడడుగుల పొడుగు, రెండున్నర అడుగుల ఎత్తు వున్న అల్సేషియస్ కుక్క ఆ చీకటి రాత్రిలో కాలి నడకన రూమ్‌కి వెళ్తున్న నన్ను అడ్డగించింది. ''భౌ'' అంటూ ఒక్కసారిగా ఎగిరి రెండు కాళ్ళ నా భుజం మీద పెట్టి నమిలి మింగేసేలా నాలుక బయటపెట్టి నన్ను వాసన చూస్తోంది. చెమటలు పట్టేశాయి. నా ప్లిలు, అమ్మ నాన్న అందరూ గుర్తొచ్చారు. ''ఈ రాత్రిలో ఈ కుక్క చేతిలో చచ్చిపోయాను. బ్రతికి బయటపడితే ఇంక అమెరికాలో వుండను. ఇంటికి వెళ్ళిపోతాను, దేవుడా'' అంటూ ఏడ్చేశాను....
రిక్రూటర్‌గా పనిచేయమన్నారు. ఒక రూమ్, ఒక ఫోన్ ఇచ్చారు. ఫోన్లో కాల్ చేయడం ఆరంభించిన మొదటిరోజునే అర్థమైపోయింది. నాకు ఇంగ్లీషు మాట్లాడటం రాదు. అమెరికన్ ఇంగ్లీషు యాస అసలు అర్థం కాదు. ఈ ఉద్యోగం నేనేం చేస్తాను? చేయలేకపోతే, పెట్రోలు బంకులో గ్యాస్ ఫిల్లింన చేయాలి? బేబీ సిట్టింగ్ చేయాలా... ఎంతకాలం? పిల్లలు, కుటుంబం గుర్తొచ్చారు. అమెరికా వచ్చి తప్పుచేశానా? ఓడిపోయానా? నాలో అంతర్మధనం మొదలైంది....
2008లో అమెరికాని ఆర్థిక సంక్షోభం భయంకరంగా కుదిమేసింది. అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు మూతపడిపోయాయి. చాలామంది భారతీయులు మన దేశానికి తిరిగి వచ్చేశారు. నేనేం చేయాలి? నా కంపెనీ భవిష్యత్ ఏమిటి? అమెరికాకి తీసుకువచ్చిన నా పిల్లల భవిష్యత్ ఏమిటి? తప్పు చేశానా? జీవితంలో ఓడిపోయానా?...