పద్మశాలీల పుట్టుపూర్వోత్తరాలను ఆకళింపు చేసుకొని, వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి, వివిధ రాష్ట్రాల చేనేత పరిశ్రమ తీరుతెన్నులు పరిశోధించి, వారి సమస్యలకు వారే పరిష్కారమార్గాలు కనుగొనే మార్గం చూపిందీ 'అగ్గిపెట్టెలో ఆరుగజాలు' నవల. నేతన్నల కుటుంబానికి చెందిన నాకు కూడా తెలియని చేనేత పరిశ్రమకు చెందిన ఎన్నో విషయాలను ఈ నవలలో పొందుపర్చారు శ్రీమతి మంథా భానుమతిగారు.
నేడు నేతన్నల జీవితాల్లో చీకటి పర్చుకుందన్నది కాదనలేని వాస్తవం. కులవృత్తి కూడు పెట్టక, పర్యాయ ఉపాధి అవకాశాలు లేక, ఎందరో చేనేత కార్మికులు ఆకలికి అలమటిస్తూ, అప్పుల్లో కూరుకుపోయి, చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 'కులవృత్తికి సాటిలేదు గువ్వల చెన్నా' అనే నానుడికి మంగళం పాడి చాలామంది నేతన్నలు వేరే పనుల్లోకి మళ్లుతున్నారు. వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం ఈ 'అగ్గిపెట్టెలో ఆరు గజాలు'.
- అంబల్ల జనార్దన్