ఈ ప్రపంచంలో రకరకాల చిత్రాలున్నాయి. కొన్ని భావం ప్రధానం, కొన్ని టెక్నిక్ ప్రధానం; కొన్ని రేఖ ప్రధానంగా గలవి, కొన్ని వెలుగునీడలు ప్రధానంగా గలవి; కొన్ని రూపాలు గలవి, మరికొన్ని రూపాలు లేనివి; కొన్ని సందేశాత్మకం, మరికొన్ని సందేశంలేనివి.
ఇన్నిరకాలు ఎందుకు ఉద్భవించాయి? ఎలా ఉద్భవించాయి. అసలు ఎన్ని రకాలు, ఎన్ని శైలులు, ఎన్ని రీతులున్నాయి?
ఈ ప్రశ్నలు చిన్నప్పటి నుండీ నా బుర్రలో మెదిలేవి. నా చుట్టూ వున్న పెద్ద చిత్రకారులు చెప్పేవి నాకు తృప్తినివ్వలేదు. వాటి గురించి తెలుసుకోవాలని గ్రంధాలలోకీ ప్రయాణంచేశాను. కొంత కొంత అర్ధం అయింది.     ప్రతి శైలి వెనుకా ఒక సిద్ధాంతం వుంది. వివిధ రీతుల ఆవిర్భావానికి కొన్ని చారిత్రక కారణాలు, శాస్త్రీయ పరిశోధనల ప్రభావాలు వున్నాయని అర్ధమయింది. వివిధ చారిత్రక దశల్లో కొత్తకొత్త ఆలోచనలు పుట్టుకొచ్చాయి. పాత భావాలూ ఘర్షణ పడ్డాయి.
1994లో ప్రచురించబడిన నా తొలిగ్రంథం "చిత్రకళ చరిత్ర" లో ఆధునిక చిత్రకళ గురించి ఒక చిన్న వ్యాసం వుంది. దానిని చదివిన డా.సంజీవదేవ్ గారు "ఈ వ్యాసం చాలా ముఖ్యమైంది. ఈ విషయాలు చాలా మందికి తెలియవు" అని నన్ను మెచ్చుకున్నారు.
అదే పుస్తకాన్ని (చిత్రకళచరిత్ర) చూడగానే శ్రీ చలసాని ప్రసాదరావుగారు "చిత్రకారులకు విందు భోజనం వడ్డించావు" అని కామెంట్ చేశారు నాతో.
నా అభిప్రాయాలకు బలం వచ్చింది. ఈ అంశంపై ఒక గ్రంధమే వ్రాయొచ్చని నాకు తోచ్చింది. ఒకోశైలి మీదా ఒక వ్యాసం వ్రాయడం మొదలుపెట్టాను. వాటిని "వనితాజ్యోతి" ఎడిటర్ గారు(శ్రీ జె. సత్య నారాయణ) తమ మాసపత్రికలో సీరియల్ గా వేసుకున్నారు. వాటిని అన్నిటినీ కలిపిన గ్రంధమే ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good