ఈ పుస్తకంలోని వ్యాసాలు చదువుతూంటే అర్ధశాస్త్రాన్నే చదువుతున్న అనుభూతి కలుగుతోంది. దీనిలో ప్రతి వ్యాసం ఒక విజ్ఞాన ఖండిక. ఆర్ధిక విషయాల్ని విడమర్చి, అర్ధమయ్యే రీతిలో చెప్పడం అంత సులభం కాదు. రాజకీయ శాస్త్రజ్ఞుడయినప్పటికీ, అర్ధశాస్త్రాన్ని కఠోరదీక్షతో అధ్యయనం చేసి, ఔపోసనంపట్టి, ఒడబోసి, ఆ విజ్ఞాన సర్వస్వాన్ని, సారాంశాన్ని సామాన్య మనిషికి కూడా అవగాహన కల్పించడంలో పాపారావు కృషి ప్రశంసనీయం. ఆర్ధిక రంగం అనేక ఇతర రంగాల్ని శాసిస్తుందని మనకు తెలుసు. దీని ప్రభావం అన్ని వర్గాల ప్రజలపైన వుంటోంది. ఆర్ధిక విషయాలు సామాన్యుడి నిత్యజీవితంలో ఎలాంటి ప్రభావం కలిగిస్తాయో రచయిత ప్రతి వ్యాసంలోనూ వివరించారు. ఆర్ధిక అంశాలు దేశీయ రంగానికే కాదు, అంతర్జాతీయ స్ధాయికి కూడా సంబంధించినవి కావొచ్చు. ప్రజల జీవతాలను మెరుగుపరచేదే ఆర్ధిక అభివృద్ధి. పెట్టుబడిదారీ వర్గాల, ప్రైవేట్‌ కార్పోరేట్‌ కంపెనీల లాభార్జనాలకు, సంపద పోగేసుకోవడానికి కల్పించే అవకాశం ఆర్ధిక అభివృద్ధి కాదనేనది పాపారావు గారి దృఢ అభిప్రాయం. ఈ పుస్తకం ద్వారా తెలుగు సమాజానికి ఒక విస్పష్టమైన సందేశాన్ని అందించడానికి వారు కృషి చేశారు. ఇప్పటికే వారు పుంఖాను పుంఖంగా రచనలు చేసిన మేధావిగా ప్రఖ్యాతి పొందారు. తెలుగు పాఠకులకు వారు కొత్త కాదు, సుపరిచితులే.

ఈ పుస్తకంలో ప్రతి పేజీలోనూ రచయిత యొక్క విస్తృతమైన, లోతైన అధ్యయనం కనబడుతోంది. అనేక మంది ప్రఖ్యాత సిద్ధాంతకర్తలు, మేధావులు, ఆర్ధికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాధినేతల సిద్ధాంతాలను, భావాలను, ఆలోచనల్ని, వ్యాఖ్యల్ని, అభిప్రాయాల్ని సందర్భోచితంగా ఉటంకిస్తూ రచయిత చేసిన విశ్లేషణ ఆశ్చర్యకరం, శ్లాఘనీయం. పాపారావు నిజమైన ప్రజాస్వామికవాది, అభ్యుదయవాది, ప్రఖ్యాత పత్రికా రచయిత అయిన ఈయన కలం నుంచి జాలువారిన ఈ పుస్తకంలోని వ్యాసాలు ఎంతో విజ్ఞానదాయకమైనవి. - ప్రొఫెసర్‌ కె.ఆర్‌.చౌదరి

Write a review

Note: HTML is not translated!
Bad           Good