ఆనాటి కానాడు జెన్నీ భర్త ప్రేమ క్షీరవారాశిలో వటపత్రశయని అయి ఆనంద తరంగ డోలికాలోల పరవశయైపోతున్నది. ఆమె మూర్తిని హిందూ బాలికల వలె పూజింపసాగింది. ఆమె అద్భుతాలైన ఖద్దరు పట్టుచీరలు కొనుక్కొని కట్టడం నేర్చుకుంది. బెంగుళూరి పట్టు రవికలు, భారతీయ భూషణాలూ అలంకరించు కొనసాగింది. ఆ నూతన మనోహరి వేషం చూస్తూ మూర్తి పరవశుడై పోయినాడు.
మూర్తి పని జూన్‌ నెలాఖరుకు మూడు పాళ్ళు పూర్తి అయిపోయింది. జలాశయం, జలసూత్రాలు, గొట్టాలు, కొండపని అంతా పూర్తి అయినాయి.
వానలు ప్రారంభించాయి. పని అంతవరకూ బాగా ఉందని ఎంతో సంతోషిస్తూ, మూర్తి ఇంటికి వచ్చేసరికి, జెన్నీ ఇంటికి రాలేదు. మూర్తి స్నానం చేసి సావిడిలో పడక కుర్చీలో కూర్చుండి పైపు కాలుస్తూ, పగటి కలలు కంటున్నాడు. కాలం ఎంత జరిగిందో అతనికి తెలియదు. చటుక్కున జెన్నీ కలకలలాడుతూ లోనుండి నెమ్మదిగా నడిచి వచ్చి భర్త కన్నులు మూసింది. అతడులిక్కిపడి ''దొంగా! నా సామ్రాజ్ఞివి నువ్వు! తెలుసుకున్నానులే!'' అన్నాడు.
ఆమె చేతులు తీసి, అతని పైపు నోటనుండి తీసి బల్లమీద పెట్టి అతని ఒళ్లో కూర్చుని అతని మెడ చుట్టూ చేయి వైచి, అతని చెవి దగ్గర నోరుంచి ''ఓ నా నరుడా! నువ్వు తండ్రివి కాబోతున్నావు!'' అని చెప్పి, అతని కన్నులు మూసింది.
''ఆ...!'' అంటూ మూర్తి భార్యను గట్టిగా హృదయానికి అదుముకొని, ''నా దేవీ! కుళ్ళు నీళ్ళలో పొర్లాడే ఈ పశువును ఐరావతాన్ని చేశావు. నాకు నా ఆత్మలో నీ ఆత్మ కలిపి ఒక దివ్యవరం ప్రసాదించావా?'' అని ఆమె పెదవులు చుంబించినాడు. అంటూ ఎంతో ఆహ్లాదకరమైన సన్నివేశంతో ముగించారు శ్రీ అడివి బాపిరాజు గారు తమ సాంఘిక నవల నరుడుని.
ఈ సంపుటంలో వారు రచించినదే మరో సాంఘిక నవల జాజిమల్లి కూడా ఉంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good