భారతీయ దర్శనాలలో కెల్ల అత్యంత క్లిష్టమైనది బౌద్ధం. అందులోను నాగార్జునుని మాధ్యమిక, శూన్య వాదాలు మరీను. అందుకని పాఠకుల నుంచి ఈ గ్రంథం కొంత ప్రాధమిక బౌద్ధ అవగాహనను ఆశిస్తున్నది. అందునా నాగార్జునుని దర్శనం పరిభాషా భూయిష్టం. ఆ పరిభాష మీద గూడ పాఠకునికి కొంత అధికారం అవసరం.
ముఖ్యంగా ఈ గ్రంథ ముఖ్యోద్దేశం నాగార్జునుని దర్శనాన్ని తెలుగు వారికి అందించడానికే ఉద్దేశితమైనా, దీనికి నేపథ్యంగా, బుద్ధుని బోధ, నాటి పరిస్ధితులు, అంతకు ముందరి సమణ - బ్రాహ్మణ సంప్రదాయాలు, బుద్ధుని తరవాత బౌద్ధంలో వచ్చిన చీలికలను గురించి సుదీర్ఘంగానే చర్చించటం జరిగింది. గ్రంథంలో దాదాపు సగభాగం ఇదే ఆక్రమించింది. నాగార్జునావతరణానికి ఇది చాలా ఆవశ్యకమని భావించబడింది. ఆ తరువాత నాగార్జునుని జీవిత కథ, అతని ప్రాధమిక దార్శనిక విషయాలను తెలియజేసే, నాలుగు వందల యాభై కారికలున్న 'మూల మాధ్యమక కారిక'ను, దాని ఇరవై ఏడు ప్రకరణాలతో - ఆయా శీర్షికలతో - స్థూలంగా చర్చించడం జరిగింది. ఇది ఒక పట్టాన కొరుకుడు పడని గ్రంథం. అయినా యథాశక్తితో, పారిభాషిక పదాలను వీలైనంత వరకు వర్ణించి సులభ బోధకమయ్యే ప్రయత్నమే చేశాను. ఏదైనా కొంత పాఠకుని స్ధాయి మీద గూడ ఆధారపడి ఉంటుందనేది నిర్వివాదం.
కావాలనుకొన్న వారు మొదటి భాగాన్ని వదిలేసి, రెండో భాగంతో, అంటే నాగార్జునుని జీవితంతోనే ఈ గ్రంథం చదవడం ప్రారంభించవచ్చు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good