మనుషుల ఆరోగ్యాన్ని కూడా వ్యాపారంగా మార్చేసిన పెట్టుబడిదారీ సంస్కృతికి పుట్టిన వికృత శిశువులయిన ఈ స్టార్ హాస్పిటళ్ళ మీద రచయిత్రి సంధించిన నిశితాస్త్రం 'ఆఖరికి ఐదు నక్షత్రాలు''... తెలుగు కథా సాహిత్యంలో ఆధునిక వైద్యానికి సంబంధించిన ఈ చీకటి కోణాన్ని ఛాయాదేవికి ముందు మరే రచయితా స్పృశించినట్లుగా లేదు.
ఒక మూడు దశాబ్దాల ముందు అమ్మాయిలు చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ పెళ్ళి సంబంధం కుదరగానే అనివార్యంగా ఉద్యోగాలు మానేయాల్సిన పరిస్థితి వుండేది. ఉద్యోగం మానేసి ప్రతీదానికీ భర్త ముందు చేయిచాస్తూ తీవ్రమైన అసంతృప్తికి లోనవుతూ భర్త సేవ చేసుకుంటూ, అతని చుట్టూరా తిరుగుతుండే పరిస్థితిని చెప్తూ 'ఉపగ్రహం' అన్న కథ రాశారు ఛాయాదేవి. ఉపగ్రహాల్లా వుండిపోవడం ఒక వైపేతే స్త్రీలు తమ స్వయంకృషితో సమాజ గుర్తింపు తెచ్చుకునే సమయంలో వారి స్వయం ప్రకాశాన్ని తాము ఆక్రమించుకుని, వారిని చీకటిలోకి నెట్టివేయడం మరోవైపు...
స్త్రీలు స్వేచ్ఛనే కాకుండా, వ్యక్తిత్వాలను కూడా చేజార్చుకోవడమనే పరిస్థితి ''సతి'', ''ఆయన కీర్తి వెనక'' వంటి కథలలో మనకి కన్పిస్తుంది. ''ఉడ్‌రోజ్'' అన్న కథలో తాజాగులాబీలూ, ఉడ్రోజ్లూ కలిపి వాజ్లో పెడుతుంది కోడలు, యవ్వనమూ, వృద్ధాప్యమూ కలగలిసి వున్నట్లుగా. అయితే దట్టంగా అల్లుకుపోయిన ఉడ్‌రోజ్ తీగను కొడుకుపెరికి పారేయడం చూసి, తల్లులు మమతల తీగెలను దట్టంగా అల్లుకు పోగలరు కానీ పిల్లలు అతి తేలిగ్గా దాన్ని పెకలించి పారేయగలరని నిట్టూరుస్తుందా తల్లి... ''తనమార్గం'' అన్న కథలో, ఎంత పిల్లలయినా తమ స్వేచ్ఛను తాము పోగొట్టుకోకూడదనీ, తనంతట తానుగా జీవించడమే సరయిన మార్గమనీ, వర్ధనమ్మ పాత్ర ద్వారా తెలియచెప్తారు.....
Pages : 103