బైరాగి పూర్తి పేరు ఆలూరి బైరాగి చౌదరి. 1925 సెప్టెంబరు 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తెనాలిలోని అయితానగరంలో ఒక రైతు కుటుంబంలో బైరాగి జన్మించాడు. తండ్రి వెంకట్రాయుడు. తల్లి సరస్వతి. బైరాగి పేరు గురించి ఆయన బాల్య మిత్రుడు నన్నపనేని సుబ్బారావు ఒక చిత్రమైన విషయం చెప్పారు. తల్లిదండ్రులకు బైరాగి ముందు ఇద్దరు మగ పిల్లలు కలిగి రెండు మూడేండ్లు నిండకుండానే గతించారు. మూడవ మగబిడ్డ కలిగిన తరువాత ఆ బిడ్డను చూచి తాత 'బైరాగిలా తెల్లగా వున్నావురా!' అన్నాడట. బహుశా అప్పుడే క్రొత్తగా వాడుకలోకి వచ్చిన ఫేస్ పౌడర్ ఆ బిడ్డకు ఒంటినిండా పులిమి వుంటారేమో! అదీ కాక ఒకరిద్దరు బిడ్డలు పోయిన తర్వాత కలిగిన వాళ్ళకు వింతపేర్లు పెట్టే అలవాటు కూడా ఉంది కదా! ఈ విధంగా పెద్దలు ఆ బిడ్డకు 'బైరాగి' పేరు ఖాయం చేశారు.... |