మూడు నుండి నాలుగు వేల సంవత్సరాల క్రితం సముద్ర తీరంలోని నదీ డెల్టాలలోనూ, నదీ లోయలలోనూ, ఇతరత్రా అనుకూలమయిన ప్రాంతాలలోనూ ఆటవిక సమాజం నశించి వ్యవసాయిక వర్గ సమాజం ఏర్పడడం ప్రారంభమయింది. సముద్రతీరంలోని పల్లపు భూములు, కృష్ణ, గోదావరి, కావేరి, మహానది, నర్మద, తపతి, ఇతర ఉత్తర భారతదేశపు నదులు - ఒక్కొక్కటీ ఒక్కొక్క కేంద్రమయింది. ఈ ఒక్కొక్క కేంద్రంలో ఏర్పడ్డ వర్గ సమాజం ఒక్కొక్క 'జాతి'కి (తెలుగు, తమిళ, మలయాళ, మరాఠా, ఒరియా వగైరా) బీజమయింది. ఈ జాతులు ఆ కేంద్రం నుండి వీలయినంత దూరం విస్తరిస్తూ అడవులను మైదానాలుగా మారుస్తూ అక్కడి ఆటవికులను తమలో బలవంతంగా కలుపుకుంటూ పోయాయి. ఈ విధంగా ఒక్కొక్క ఆధునిక జాతి ఏర్పడింది. ఒక జాతికీ మరొక జాతికీ మధ్య వాటి విస్తరణకు ఇంతవరకు లొంగని అడవులు, పీఠభూములు మిగిలిపోయాయి. అక్కడ నివశించే ఆటవికులు ఆర్థికంగా ఇప్పటికీ ఆటవికులుగానూ, సాంస్కృతికంగా ఏజాతికీ చెందనివారుగానూ మిగిలి పోయారు. అందుకే మన దేశంలో ఏ రెండు పరిసర రాష్ట్రాలను తీసుకున్నా వాటి సరిహద్దుల్లో అడవులు, కొండలు, పీఠభూములు, అక్కడ నివశించే గిరిజనులు కనబడతారు. ఏ రాష్ట్రలోనూ రాష్ట్ర గర్భంలో గిరిజనులు కనబడరు...
బ్రిటీష్ వాళ్ల కాలం నుండి ఇప్పటిదాకా మన దేశం సాధించిన 'అభివృద్ధి' వల్ల అత్యధికంగా నష్టపోయింది గిరిజనులే. అత్యధికంగా ఈ 150 సంవత్సరాలలో తిరుగుబాట్లు చేసింది కూడా గిరిజనులే. - కె.బాలగోపాల్
Pages : 152