చిన్నకథలకు కళింగాంధ్ర పెట్టింది పేరు. కొండను అద్దంలో 'కొంచెం'గా చూపించడం అక్కడి రచయితలకు అలవాటు. ఇది ఆ రచయితలకు అంబలితోనూ, ఆవకాయతోనూ అలవడిన విద్య. ఆ కోవలేనివారే ప్రముఖ పాత్రికేయులు, కథారచయిత అయలసోమయాజుల నీలకంఠేశ్వర జగన్నాథశర్మ (ఎ.ఎన్‌.జగన్నాథశర్మ).

వర్షం కురిసిన వాతావరణంలో 'పేగుకాలిన వాసన' కమ్ముకుంటుంది. చీకటి సముద్రంలో చిరునావ లాంటి జట్కా బండి గూట్లో పల్లెటూరి ప్రయాణీకులతో పాటు పాఠకులూ ఇరుక్కుంటారు. గాలివాటు జల్లుకి తడిసిపోతారు. జట్కావాలా బాల్యంతో మమేకమయి గోనెసంచుల్లోని కర్రపొట్టులాగా గుండె నిండా బాధను కూరుకుంటారు.

'నాన్నంటే' నిత్యావసర వస్తువన్న సత్యాన్ని రక్తంలో తడిసిన ఎర్ర స్వెట్టరు చెప్తే, గుమ్మడి గింజ లాంటి ఓ అజ్ఞాత వీరుడు కాల్చిన చుట్ట ఆసన పరిసరాల్లో గుప్పుమంటుంది. ఎర్ర స్వెట్టర్‌ భావి తరానికి దిక్సూచిలా ఉండిపోతుంది.

పంతుల్లాంటి సామాన్యుణ్ణి పిల్లి కింద జమకడితే, అణచివేత గడిలో బంధించి ఉసిగొల్పితే, అతను 'పులి' వేషం ధరిస్తాడు. తన ధిక్కారాన్ని గాండ్రింపులో ధ్వనిస్తాడు. అచ్చం పులిలాగే దోపిడీదారు పీకని నోట కరచుకుని తిరుగుబాటు లోయలోకి దూకేస్తాడు.

రెణ్ణిమిషాల సుఖాన్నిచ్చే 'జాగా' కోసం, ఏకాంతం కరువై, కోరికలు చంపుకోవడమే సుఖమనిపించిన జీవితాలు మూలుగులై వినిపిస్తాయి. దిగువ మధ్యతరగతి పంచలో ఎన్ని రకాల హత్యలుంటాయో జాలిగా చూపిస్తాయి.

చితికిపోయిన బాల్యం రైలు పట్టాలమీది ఆశల శకలాల కోసం వెదుకుతుంది. ముచ్చిరేకుల్ని ముత్యాలుగా భ్రమపడి ఏరుకుంటుంది. చివరికి రైలు చక్రాల కింద నలిగిన శవంలో ప్రతిబింబించి 'పట్టామీదినాణెం'లా ఆకారాన్ని కోల్పోయి, చదువరుల్ని భయపెడుతూ, హృదయాల్లో పదునుగా నాటుకుంటుంది.

కట్టుకున్నవాణ్ణి కోల్పోయి, కీచకుడి లాంటి మరిది పంచలో గతి లేక చేరిన ఆడకూతురు, వాడిలోని పశువుకి వశమైతే తప్ప బతుకు గడవని పరిస్థితిలో, అన్నీ తెలిసిన కన్నతల్లి-బతుకు భయంతోనూ, పాపానికి జన్మనివ్వొద్దన్న హెచ్చరికతోనూ తన చేతిలో పెట్టిన నిరోధ్‌ ప్యాకెట్టును చూసి 'నిప్పు బొమ్మ'గా మిగిలిన దారుణం గుండెల్లో విస్ఫోటిస్తుంది.

Pages : 111

Write a review

Note: HTML is not translated!
Bad           Good