ఆయన పేరు సుబ్బయ్య. ప్రజలు ముద్దుగా పిలుచుకునేది వీఎస్. ఇదేదో ఓ వ్యక్తికి సంబందించింది కాదు. ఓ స్వాతంత్య్ర సమరయోధునికి, అదీ ఫ్రెంచ్-ఇండియా విముక్తి ఉద్యమానికి అంకితమైన సర్వస్వాన్నీ త్యాగం చేసిన వ్యక్తి జీవితంతో ముడిపడి ఉన్న పేరది. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహరహారం పరితపించిన హృదయమది. సుమారు మూడు దశాబ్ధాల పాటు ప్రజల కోసం, ప్రజలతో మమేకమై సమరాంగణాన నిలబడిన మహామనిషి కామ్రేడ్ వీఎస్. వలసవాదుల గుండెల్లో నిదురించి, పాండీచ్చేరి ప్రజల మనసుల్లో స్వేచ్ఛా స్వాతంత్య్రాల కాంక్షను రగిలించి అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ధీరుడు, వీరుడు. ఆయనో సామాజిక వేత్త. ఎన్ని కష్టాలొచ్చినా, నష్టాలొచ్చినా, చివరకు తన ప్రాణాలకు ముప్పొచ్చినా ఏ మాత్రం వెరవక ప్రజల పక్షాన నిలిచిన చరితార్థుడు. అటు ఫ్రెంచ్-ఇండియా ఇటు బ్రిటీష్-ఇండియా చరిత్రపుటలకెక్కిన నేతలకే ఆదర్శప్రాయుడు. అటువంటి మహనీయుని సంక్షిప్త జీవిత చరిత్ర ఈ పుస్తకం.
కావడానికిది వీఎస్ జీవిత చరిత్రే కావచ్చు గాని వాస్తవానికిది పుదుచ్ఛేరి 20 శతాబ్దపు చరిత్ర కూడా. వీఎస్ జీవిత చరిత్ర నుంచి పుదుచ్ఛేరి స్వాతంత్య్ర పోరాటాన్ని విడదీసి చూడడం అసాధ్యం. అసంభవం.